: భారత్ లో విమానం ఎక్కాలంటే కొత్త నిబంధనలు ఇవి!
విమాన ప్రయాణికులపై కొత్త నిబంధనలు విధిస్తూ, మోదీ సర్కారు కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, ఈ కొత్త నిబంధనలతో కూడిన చట్ట సవరణ వివరాలను తెలియజేశారు. వీటి ప్రకారం, విమానాశ్రయం, విమానాల సిబ్బందితో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే, మూడు నెలల పాటు మరోసారి విమానం ఎక్కకుండా నిషేధిస్తారు. సిబ్బందిని లైంగికంగా వేధిస్తే, ఆరు నెలల పాటు, భౌతిక దాడులకు పాల్పడితే రెండేళ్ల పాటు విమాన ప్రయాణ నిషేధాన్ని అమలు చేస్తారు. ఈ మేరకు కొత్త చట్ట సవరణను వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, శివసేన ఎంపీ గైక్వాడ్ వ్యవహారం తరువాత ఈ కొత్త చట్టాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే.