: చాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఎక్కడ?.. వెంటనే సెలక్ట్ చేయాలని బీసీసీఐకి ఆదేశం


ఐసీసీతో రెవెన్యూ షేరింగ్ లో వచ్చిన విభేదాలను ప్రస్తుతానికి పక్కనబెట్టి, త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును తక్షణం ఎంపిక చేయాలని బీసీసీఐని సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆదేశించింది. ఏప్రిల్ 25లోగా 2017 చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టును ప్రకటించాల్సి వుందన్న విషయాన్ని గుర్తు చేసిన కమిటీ, తక్షణమే సెలక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి జట్టును ప్రకటించాలని, ఆ వివరాలను ఐసీసీకి పంపాలని తెలిపింది.

జూన్ 1 నుంచి ఇంగ్లండ్ లో జరిగే పోటీల్లో పాల్గొని భారత జట్టు టైటిల్ ను నిలుపుకోవాలని ప్రతి క్రీడాభిమానీ కోరుకుంటున్నాడని, పోటీలకు వెళ్లే ఆలోచన బీసీసీఐకి లేదని వచ్చిన వార్తలపై వారు స్పష్టతను అడుగుతున్నారని తెలిపింది. ఆటగాళ్లకు టోర్నీకి సన్నద్ధమయ్యే సమయం కూడా ఇవ్వాల్సి వున్న కారణంగా సాధ్యమైనంత త్వరగా జట్టును ప్రకటించాలని, ఏమైనా సమస్యలుంటే తదుపరి పరిష్కరించుకోవచ్చని చెప్పింది. బీసీసీఐ హక్కులను కాపాడుకునే దిశగా తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరికి లేఖను రాసింది.

  • Loading...

More Telugu News