: శివసేన ఎంపీ ఘటన తర్వాత... ఇండియాలో విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఘటన తరువాత, ఇండియాలో తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం నిబంధనలు తయారయ్యాయి. వీటి ప్రకారం, ఓ వ్యక్తిని విమానం నుంచి దించివేయడానికి గానీ, లేదా విమానం ఎక్కనీయకుండా చేయడానికి గానీ అధికారం ఆయా విమానయాన సంస్థలకు ఉంటుంది. ఈ మేరకు 'నో-ఫ్లయ్' లిస్టును ప్రకటిస్తూ, వీటిల్లో ఏ పని చేసినా, విమానం ఎక్కనివ్వబోమని స్పష్టం చేసింది.
విమానంలో లేదా ఎయిర్ పోర్టులో సమస్యలు సృష్టించినా, సాధారణ విమానయానానికి అవాంతరాలు కల్పించినా, సదరు వ్యక్తి నేరం చేసినట్టుగానే భావించి, అతన్ని దించేసే అధికారం ఎయిర్ లైన్స్ సంస్థలకు ఉంటుంది. విమాన భద్రత, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఘటనలకు పాల్పడినా అతను ప్రయాణించకుండా నిలువరించవచ్చు. ఒకసారి 'నో-ఫ్లయ్' లిస్టులో పేరు చేరితే, అతనికి విమాన టికెట్ ను ఇవ్వబోరు. ఈ కొత్త ప్రతిపాదనలను నేడు పౌరవిమానయాన మంత్రి అశోక గజపతి రాజు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎయిరిండియా సిబ్బంది పట్ల శివసేన ఎంపీ తీరును పార్లమెంటులో తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, ఆపై పలువురు ఎంపీల సలహా, సూచనలతో దిగివచ్చిన సంగతి తెలిసిందే.