: చరిత్ర సృష్టించిన నాగాలాండ్.. ఆసియాలోనే అతిపెద్ద చర్చి ప్రారంభం.. డిజైన్ చేసింది ముగ్గురు పిల్లల తల్లి!
ఆసియాలోనే అతిపెద్దదైన చర్చిని ప్రారంభించి నాగాలాండ్ చరిత్ర సృష్టించింది. జున్‌హెబెటో పట్టణంలోని కొండపై నిర్మించిన సుమి బాప్టిస్ట్ చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా రికార్డులకెక్కింది. ముగ్గురు పిల్లల తల్లయిన ఆర్కిటెక్ హొనాహోలి కె.క్రిషి-ఝిమోమి (38) ఈ చర్చిని సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచం దృష్టిని తనవైపు ఆకర్షించారు. చర్చి నిర్మాణానికి రూ.36 కోట్లు ఖర్చు కాగా, 2 వేల మంది కార్మికులు చర్చి నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
13 ఏళ్ల క్రితం ఈ చర్చికి డిజైన్ చేయగా నిర్మాణానికి దాదాపు 11 ఏళ్లు పట్టింది. చర్చి డిజైన్ విషయంలో తనకు భగవంతుడే సహకరించాడని, అతడే తనకు స్ఫూర్తిప్రదాత అని ఝిమోమీ పేర్కొన్నారు. భగవంతుడి కోసం అద్భుతమైన డిజైన్‌తో మందిరం నిర్మించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కోడిగుడ్డు ఆకారంలో తీర్చిదిద్దిన ఈ చర్చిలో 8500 మంది కూర్చునే వీలుంది. 27 గదులున్నాయి. జిల్లాలోని 20 గ్రామాల నుంచి కూడా ఈ చర్చి బ్రహ్మాండంగా కనిపించడం ఈ చర్చి ప్రత్యేకత.