: రాచరికపు బాధ్యతల నుంచి వీడ్కోలు తీసుకోనున్న ప్రిన్స్ ఫిలిప్!
బ్రిటన్ కింగ్ ప్రిన్స్ ఫిలిప్ రాచరికపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నిన్న బకింగ్ హామ్ ప్యాలెస్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 (91) భర్త, ప్రిన్స్ ఫిలిప్ (95) ఈ ఏడాది ఆఖర్లో రాచరిక బాధ్యతల నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన రాజకుటుంబం ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది.
బకింగ్ హామ్ ప్యాలెస్ లో అత్యవసర సమావేశం అనగానే అంతా బకింగ్ హామ్ ప్యాలెస్ పై ఉన్న జెండావైపు చూశారు. జెండా అవనతం చేయకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే జూన్ 10న 96వ సంవత్సరంలోకి చేరుకుంటున్న ప్రిన్స్ ఫిలిప్, వయోభారం కారణంగా రాచరికపు బాధ్యతల నుంచి వైదొలగుతున్నారని బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిలిప్ తీసుకున్న నిర్ణయానికి భార్య క్వీన్ ఎలిజబెత్ నుంచి పరిపూర్ణ మద్దతు లభించిందని బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది. అయితే ప్రిన్స్ ఫిలిప్ నిర్ణయం క్వీన్ ఎలిజబెత్ కార్యక్రమాల షెడ్యూల్ పై ఏమాత్రం ప్రభావం చూపదని బకింగ్ హామ్ ప్యాలెస్ స్పష్టం చేసింది.