: ఏంటో.. పిచ్చి జడ్జిలు.. పిచ్చి ఆదేశాలు..!: సుప్రీం న్యాయమూర్తులపై విరుచుకుపడిన జస్టిస్ కర్ణన్
తన మతిస్థిమితంపై వైద్య పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణణ్ మండిపడ్డారు. అవి పిచ్చి జడ్జీలు ఇచ్చిన పిచ్చి ఆదేశాలు అని కొట్టి పడేశారు. కర్ణన్ మానసికి స్థితిని తెలుసుకునేందుకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చీఫ్ జస్టిస్‌తోపాటు రాజ్యాంగ ధర్మాసనంలోని ఆరుగురు సభ్యుల బృందం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం నలుగురు వైద్యుల బృందం కర్ణన్ నివాసానికి చేరుకుంది.
పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించిన కర్ణన్ మాట్లాడుతూ తాను భేషుగ్గా ఉన్నానని, తనకు వైద్య పరీక్షలు నిర్వహించాలనుకోవడం తనను అవమానించడమేనని అన్నారు. వైద్య పరీక్షలను తిరస్కరిస్తున్నట్టు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. అయితే ఇటువంటి పరీక్షలను తన సంరక్షకుడి సమక్షంలోనే నిర్వహించాలని, తనకు సంబంధించినవారు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం కుదరదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో వైద్య బృందం వెనుదిరిగింది.