: జయలలిత, శశికళ గదుల్లో గుట్టలుగా డబ్బు.. ఆస్తుల పేపర్లు.. మాజీ మంత్రి అరెస్ట్‌కు రంగం సిద్ధం!
ఏప్రిల్ 24న కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో జరిగిన దోపిడీ వెనక పెద్ద తలకాయలు ఉన్నట్టు తెలుస్తోంది. జయ ఎస్టేట్‌లో దొంగతనానికి ముందు 11 మంది దొంగలు ఓ మాజీ మంత్రి ఇంట్లో టీ తాగినట్టు ఆధారాలు లభించాయి. దీంతో ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇక జయలలిత ఇంట్లోకి ప్రవేశించిన దొంగలకు జయ, శశికళ గదుల్లో కనిపించిన డబ్బు, బంగారం చూసి కళ్లు చెదిరిపోయినంత పనైంది. డబ్బు, బంగారు ఆభరణాలు, పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన కాగితాలు కనిపించినట్టు దొంగలు చెబుతున్నారు. దోపిడీకి పాల్పడిన దొంగల్లో ఇద్దరు గతంలో జయలలితకు డ్రైవర్లుగా పనిచేసిన వారు ఉన్నారు. దోపిడీ అనంతరం డ్రైవర్లు ఇద్దరు దొంగలకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి, ఇంతటితో సరిపెట్టుకోవాలని, ఈ వ్యవహారంలో పెద్దలు ఉన్నారని, హద్దుమీరితే ప్రమాదమని హెచ్చరించారు.
దోపిడీ వ్యవహారాన్ని జయ మాజీ డ్రైవర్ కనకరాజే ముందుండి నడిపించాడని నిందితులు షంషేర్ అలీ (32), జిత్తన్ జాయ్ (20) వెల్లడించారు. కాగా పెద్ద తలకాయల గురించి దొంగలకు హెచ్చరించిన కనకరాజ్, ఆ తర్వాత కొన్ని రోజులకే అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం. మరో డ్రైవర్ సయాన్ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.
జయ ఎస్టేట్‌లోకి వెళ్లనీయకుండా వాచ్‌మెన్లు తమను అడ్డుకున్నారని, డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టినా లొంగకపోవడంతో వారిని ఇనుపరాడ్లతో గాయపరిచి లోపలికి ప్రవేశించినట్టు తెలిపాడు. లోపల సూట్‌కేసుల్లో పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలు, ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పేపర్లు కనిపించినట్టు వివరించాడు. చేతికందినంత బ్యాగుల్లో సర్దుకుని బయటపడ్డామని, కనకరాజ్ తమకు రెండు లక్షలు ఇచ్చి ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని, ఎక్కువ చేయవద్దని చెప్పడంతో దోచుకున్న సొమ్మును ఆయనకు అప్పగించి తాము కేరళ వెళ్లిపోయామని సయాన్ వివరించినట్టు తెలుస్తోంది.