: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌కు భారీ షాక్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌కు కొత్తగా చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ సంస్థలో విక్రయాలు జరిపే, వైట్ గూడ్స్ తయారీ సంస్థ బీపీఎల్ ఆ సంస్థకు గుడ్ బై చెప్పింది. ఇకపై తాము అమెజాన్‌లోనే విక్రయాలు జరపుతామని తెలిపి గట్టిగా షాకిచ్చింది. ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద ఉపకరణాల అమ్మకాల్లో ఈ కంపెనీకి చెందిన ఉత్పత్తులే దాదాపు 12 శాతానికి పైగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్‌కు అమెజాన్‌తో గట్టిపోటీ ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఒకదానిపై మరొక సంస్థ పై చేయి సాధించడానికి భారీగా పెట్టబడుల కోసం వెతుకుతూ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సమయంలో బీపీఎల్ అమెజాన్ వైపుకు మళ్లడంతో ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నేటి నుంచి తమ ఉత్పత్తులను ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్‌లో మాత్రమే అమ్మనున్నట్టు ఆ కంపెనీ ప్రకటన చేసింది.
1990లో మోస్ట్ పాపులర్ టెలివిజన్ బ్రాండ్స్ లో ఒకటిగా బీపీఎల్ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కంపెనీ 2006లో ఎలక్ట్రానిక్స్ ను విక్రయించడం ఆపివేసింది. తిరిగి 2016 నుంచి బీపీఎల్ మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అమెజాన్ తో తాము దీర్ఘకాలిక వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం కోరుకుంటున్నామని బీపీఎల్ ప్రతినిధులు చెప్పారు. అమెజాన్ తమ కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు, ఎక్కువగా దేనికోసం సెర్చ్ చేస్తుంటారు వంటి సమాచారాన్ని వెల్లడిస్తూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందని తెలిపారు. ఈ అంశం తమ కొత్త ఉత్పత్తుల లాంచింగ్ కి ఉపయోగపడుతుందని చెప్పారు.