: భగవంతుడిని నమ్ముకుంటే మాత్రం ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు!: దర్శకుడు కె.విశ్వనాథ్
భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ నిన్న ఢిల్లీలో స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో విశ్వనాథ్ దంపతులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ, ‘ఈ నాలుగు రోజులుగా పెద్ద తుపాన్ వచ్చినట్టు అయిపోయింది. ఎంతో మంది, అభినందించడానికి వచ్చారు, శాలువాలు కప్పారు, దండలు వేశారు. కానీ, ఎన్ని దండలు చూసినా, ఏ పూలు చూసినా ఒక్కటీ ఆ పూల వాసన కొట్టలేదు. వెంకయ్యనాయుడుగారు వేసిన గులాబీ దండ మాత్రం గులాబీల వాసన వస్తోంది.
ఈ అవార్డు వచ్చినందుకు మీ స్పందన ఏమిటి? అని చాలామంది అడుగుతారు. ఇలాంటి సందర్భం ఒకటి, నేను తీసిన సినిమాలో ఉంటుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు... ఆ అనుభూతి ఏంటనేది చిన్న లయ ద్వారా ఆ రచయిత చెబుతాడు. ‘అందెల రవమిది పదములదా.. అంబరమంటిన ఎద సొదదా?’ అని. నేను ఎందుకని ఇలాంటి సినిమాలు తీయగలిగాను? ఈ కోవలోనే ఎందుకు తీయగలిగాను? నేను మాత్రం డబ్బుకు లొంగిపోలేదా? ప్రలోభం లేదా? నాకు మాత్రం కమర్షియల్ గా పేరు తెచ్చుకోవాలని లేదా? అంటే.. నేను పెంచబడిన పెంపకం అలాంటిది. ఒక లోయర్ మిడిల్ క్లాసు నుంచి వచ్చిన నేను.. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి.
అవేమిటంటే..‘మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్య దేవోభవ’ అనేది బాగా జీర్ణించుకుపోయేట్టుగా మా తల్లిదండ్రులు ఉగ్గుపాలతో పట్టారు. ఇంకో కాన్సప్ట్ ఏంటంటే.. ‘గురుబ్రహ్మ గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః .. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేనమ:’, ‘సర్వేజనా సుఖినోభవంతు’. ఈ మూడు సమపాళ్లలో కనుక జీర్ణించుకుపోతే మన దృష్టి హింస మీదకు కానీ, మరి, దేనిమీదకు కానీ పోదు. ఒక్కమాట మాత్రం నేను నమ్ముతాను. భగవంతుడిని నమ్ముకుంటే మాత్రం ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు.. ఆలస్యం చేస్తాడేమో కానీ, అన్యాయం మాత్రం చేయడని గట్టి నమ్మకం’ అని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్ తన ఆనందానుభూతిని వ్యక్తం చేశారు.