: రూ.5 లకే యూపీలో అన్నం, చపాతీ, కూర, పప్పుతో కలిపి భోజనం
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం త్వరలో తక్కువ ధరకే భోజనాన్ని అందించే పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా ఉదయం టిఫిన్‌గా పకోడా, పోహ, ఓట్స్‌తో తయారు చేసిన పదార్థాలు, టీ అన్ని కలిపి రూ.3లకే అందించనున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం, రాత్రి వేళలో అన్నం, చపాతీ, శాకాహార కూర, పప్పుతో కలిపి రూ.5లకే భోజనాన్ని అందించనున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 200 ప్రాంతాల్లో ఈ 'అన్నపూర్ణ' కేంద్రాలు కనిపించనున్నాయి. ఈ పథకం వల్ల వలస కూలీలు, పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.