: ప్రజలకన్నా ఆవులే గొప్పవా?... ధైర్యముంటే మధ్యంతరానికి రండి: మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్
భారతావనిని పాలిస్తున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుతో ఎంతమాత్రమూ లాభం లేదని, వారు ప్రజల కన్నా ఆవులే గొప్పవన్నట్టు ప్రవర్తిస్తున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ కు చెందిన 'బ్యాట్' టీమ్ దేశంలోకి చొరబడి సైనికుల తలలు నరుకుతున్నా చూస్తూ ఊరకుంటున్న వైఖరిని ప్రస్తావించిన ఆయన, ధైర్యముంటే, మధ్యంతర ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
ప్రజలను రక్షించడం కన్నా గోవులను కాపాడటమే తమ తక్షణ కర్తవ్యంగా భావిస్తున్న బీజేపీ, దేశాభివృద్ధిని పక్కనబెట్టి, పార్టీ బలోపేతానికి మాత్రమే ప్రయత్నిస్తోందని అన్నారు. గత రెండు రోజులుగా శివసేన కార్యాలయంలో పార్టీ కమిటీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, మహారాష్ట్ర ప్రభుత్వ పనితీరునూ ఎండగట్టారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెబుతూ ఇతర పార్టీలను బీజేపీ భయపెట్టాలని చూస్తోందని, రేపు ఎన్నికలు జరిపించే బదులు నేడే జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఉద్ధవ్ అన్నారు.