: సైన్యంపై నమ్మకం ఉంచండి... అనుకున్నది చేస్తారు: అరుణ్ జైట్లీ విజ్ఞప్తి
పాకిస్థాన్ సైనికుల పైశాచికత్వంపై సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని, మన సైన్యంపై నమ్మకముంచాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ నెల 1వ తేదీన భారత సరిహద్దులు దాటి వచ్చి, ఇద్దరు జవాన్లను అతి కిరాతకంగా హతమార్చడమే కాకుండా వారి తలలను నరికిన పాక్ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ, జైట్లీ స్పందించారు.
సరైన సమయంలో ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని, అనుకున్నది చేసే సత్తా భారత సైన్యానికి ఉందని ఆయన అన్నారు. క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తానీ బార్డర్ యాక్షన్ టీమ్ సరిహద్దుల్లోకి 250 మీటర్ల దూరం చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడిందని స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా సైన్యం అడుగులు వేస్తుందని తెలిపారు. కాగా, ఈ ఘటనకు, తమ సైన్యానికి సంబంధం లేదని పాకిస్తాన్ మరోమారు బుకాయించింది. అసలు తమ సైన్యం సరిహద్దులు దాటాలన్న ప్రయత్నాలు కూడా చేయలేదని పేర్కొంది.