: ఇంటర్నెట్ లో ముంబై డెంటల్ కాలేజీ అమ్మాయిల అశ్లీల చిత్రాలు... నిందితుడి అరెస్టు
ముంబైలోని డెంటల్ కళాశాలకు చెందిన యువతులకు సంబంధించిన అశ్లీల ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమివ్వడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ విషయం ఆ కళాశాల విద్యార్థినులకు తెలియడంతో వారు ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విజయ్ గులాబ్ సింగ్ రాథోడ్ (26) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలను అప్ లోడ్ చేసిన ఐపీ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా, విజయ్ గులాబ్ సింగ్ రాథోడ్ వాటిని అప్ లోడ్ చేసినట్టు తేలింది. ఈ సందర్భంగా జరిగిన దారుణంపై పోలీసులు వివరిస్తూ... నాందేడ్ నగరానికి చెందిన విజయ్ గులాబ్ సింగ్ రాథోడ్ అనే యువకుడు ముంబైలోని మెడికల్ కళాశాల హాస్టల్ లో నివాసముంటున్నాడు.
విజయ్ గత నెల 21వ తేదీన డెంటల్ కళాశాల అమ్మాయిల అశ్లీల వీడియోలను కామెంట్లతో సహా ఓ వెబ్ సైట్ లో పెట్టాడు. ఈ డెంటల్ కళాశాలలో చదివిన విజయ్ అర్థాంతరంగా చదువు మానేశాడని తెలిపారు. వీటిని చూసిన ఓ డెంటల్ డాక్టర్ ముంబైలోని నాగపద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ముంబయిలోని సైబర్ సెల్ విభాగం ద్వారా ఐపీ అడ్రసును గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. అయితే కళాశాల అమ్మాయిల అశ్లీల వీడియోలు అసలువా? మార్ఫింగ్ చేసినవా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని వారు వెల్లడించారు. ఇంటర్నెట్ నుంచి ఆ వీడియోలు తొలగించినట్టు పోలీసులు తెలిపారు.