: ఇలాంటోడిని వివాహం చేసుకోనని చెప్పడమే కాదు... ఏకంగా పోలీసులకు పట్టించింది
డ్రగ్ ఎడిక్ట్ పెళ్లి కొడుకును వివాహం చేసుకునేది లేదని తేల్చి చెప్పడమే కాకుండా...డ్రగ్స్ తీసుకున్నాడంటూ వరుడ్ని పోలీసులకు పట్టించిన వధువు కథ ఇది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని గురుదాస్ పూర్ కు 12 కిలోమీటర్ల దూరంలో దీనానగర్ లోని దసరా గ్రౌండ్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కమల్ సింగ్ కుమార్తె సునీతా సింగ్ కు జస్ ప్రీత్ సింగ్ అనే లారీ డ్రైవర్ తో వివాహం నిశ్చయించారు. సమీపంలోని మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారాలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో వివాహం అనగా...భారీ ఊరేగింపుతో వచ్చిన పెళ్లికొడుకు కారులోంచి కాలు బయట పెట్టాడు. వరుడు తూలుతూ నడవడంతో అనుమానం వచ్చిన సునీత మరింత పరిశీలించగా, అతను డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించింది. అంతే అతడు బాగా డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని, అలాంటి డ్రగ్ అడిక్ట్ తో వివాహానికి అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.
దీంతో వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ తిన్నారు. తన కుమారుడు లారీ డ్రైవర్ కావడంతో కాలికి దెబ్బతగిలిందని, అందుకే నడవలేకపోతున్నాడని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సరే అని చెప్పిన సునీత... అయితే వైద్యపరీక్షలు చేయించాలని, ఆ తరువాతే వివాహం చేసుకుంటానని వెల్లడించింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డ్రగ్ టెస్టులకు సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో గురుదాస్ పూర్ లో టెస్టులు చేయించాలని కోరింది. దీంతో అక్కడ పరీక్షలు నిర్వహించగా వరుడు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వివాహాన్ని రద్దు చేసుకోవడమే కాకుండా...వరుడు డ్రగ్స్ తీసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వివాహం రద్దు చేసుకుని, ఎవరి ఉంగరాలు వారు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఆమె నిర్ణయానికి తండ్రి అండగా నిలవడం విశేషం.