: చికిత్స కోసం కుమారుడిని భుజాన వేసుకొని ఏడు కిలోమీటర్లు నడిచిన తండ్రి.. అయినా కాపాడుకోలేకపోయాడు!
తీవ్రంగా కాళ్ల నొప్పితో బాధపడుతున్న తన కొడుకుని ఓ వ్యక్తి తన భుజంపై వేసుకొని ఏడు కిలోమీటర్లు నడిచి ఉత్తరప్రదేశ్‌లోని ఈటావా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అతడి తనయుడు మృత్యు ఒడికి చేరాడు. అనంతరం కూడా ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఆ వ్యక్తి తన కొడుకు మృతదేహాన్ని మళ్లీ తన భుజంపై వేసుకొని వెళ్లాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, రోజువారీ కూలీగా పనిచేస్తోన్న ఉదయ్ వీర్... ఆసుపత్రికి చేరుకొని తన కొడుకు పుష్పేంద్ర (15) కాళ్లు బాగా నొప్పిగా ఉన్నాయని, నడవలేకపోతున్నాడని వైద్యులతో చెప్పాడు. అయితే, వైద్యులు పుష్పేంద్రకు ఏమీ కాలేదని చాలా సింపుల్‌గా చెప్పేసి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఆ బాలుడికి కేవలం కాళ్లు నొప్పులు మాత్రమేనని, కాసేపు ఉంచి తీసుకెళ్లొచ్చని చెప్పారు.
అయితే, కొద్ది సేపటికే పుష్పేంద్ర ప్రాణాలు విడిచాడు. ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా ఆ ఆసుపత్రి యాజమాన్యం కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో కొడుకు శవాన్ని భుజాన వేసుకొని ఆసుపత్రి నుంచి మళ్లీ వెనుదిరిగాడు. ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో ఈ దృశ్యాన్ని రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారులు అన్నారు.