: సినీ ఫక్కీలో రూ. 1.33 కోట్లు దోచుకెళ్లారు
పట్ట పగలు అందరూ చూస్తుండగానే, సినీ ఫక్కీలో ఏకంగా రూ. 1.33 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన పంజాబ్ లోని పాటియాలా సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, చండీగఢ్ నుంచి ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన వ్యాన్ ఈరోజు ఉదయం బానూర్, రాజ్ పురా పట్టణాల్లోని బ్యాంక్ శాఖలకు నగదును అందజేసేందుకు బయల్దేరింది. ఈ వాహనాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియోలో వెంబడించారు.
అనంతరం రాజ్ పురా పట్టణంలో విద్యాసంస్థలు ఉండే ప్రాంతం గుండా బ్యాంకు వాహనం వెళుతుండగా... వారు దాడి చేశారు. వ్యాన్ డ్రైవర్ పై కాల్పులు జరిపి రూ. 1.33 కోట్లను ఎత్తుకు పోయారు. స్థానికుల సమాచారం ప్రకారం దుండగులు రెండు వాహనాలను వాడినట్టు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు, దుండగుల కాల్పుల్లో గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.