: చంద్రబాబు నాకు క్లాసు తీసుకున్నారనే వార్త అవాస్తవం!: ఎంపీ శివప్రసాద్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనకు క్లాసు తీసుకున్నారనే వార్తలో వాస్తవం లేదని ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. తిరుపతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును నిన్న కలిశానని..స్నేహపూరిత వాతావరణంలో తామిద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. చంద్రబాబు తనకు క్లాసు తీసుకున్నారనడం సరికాదన్నారు. ఆత్మీయులు, పెద్దల సూచనల మేరకే చంద్రబాబును కలిశానని, తాను ఆశించిన పనులన్నీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారని, తనకు ఉన్న అనుమానాలు తీర్చుకున్నానని చెప్పారు.
కథ సుఖాంతమైందని, తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని, స్నేహం గొప్పదని మరోమారు రుజువైందని శివప్రసాద్ అన్నారు. కాగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వైఎస్సార్సీపీలోకి శివప్రసాద్ వెళుతున్నారని, అందుకే, ఈ వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు తలెత్తాయి. శివప్రసాద్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును శివప్రసాద్ నిన్న కలిశారు.