: సత్తా చాటాల్సిన సమయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు దుర్వార్త!
ఐపీఎల్ పదవ సీజన్ లో భాగంగా 8 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, ఆరు పరాజయాలతో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఇది దుర్వార్తే. ఆ జట్టు కెప్టెన్, కీలక బౌలర్ జహీర్ ఖాన్, గాయం కారణంగా మిగతా అన్ని మ్యాచ్ లకూ దూరమయ్యాడు. ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ జహీర్ మిగతా అన్ని మ్యాచ్ లకూ దూరంగా ఉండనున్నాడని టీమ్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, నేడు ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక మ్యాచ్ ని ఆడనుంది. ఢిల్లీ జట్టు ముందు మరో ఆరు మ్యాచ్ లు ఉండగా, కనీసం ఐదింటిలో గెలిస్తే కచ్చితంగాను, ఒకవేళ నాలుగింటిలో గెలిస్తే, నెట్ రన్ రేటు, ఇతర టీమ్ ల గెలుపోటములు ఆధారంగా ప్లే ఆఫ్ చాన్స్ ఉంటుంది. పది మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలు, ఒక రద్దుతో 13 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ జట్టు తన ప్లే ఆఫ్ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. ఒక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మినహా మిగతా అన్ని జట్లకూ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండటంతో, చివరి దశ పోటీలు రసవత్తరంగా సాగుతాయని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.