: ఆసక్తికర తీర్పు... స్కైప్ లో విడాకులు మంజూరు చేసిన జడ్జి
ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ ‘స్కైప్’ ద్వారా న్యాయమూర్తి కేసును విచారించి, విడాకులు మంజూరు చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... సాధారణంగా కరుడు గట్టిన నేరస్తుల విషయంలో కేసులను విచారించేందుకు న్యాయమూర్తులు వీడియో విచారణ నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే సెలవు దొరకని యువతిని స్కైప్ లో విచారించిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన దంపతులకు 2015లో వివాహం జరిగింది. అనంతరం కెరీర్ కలలను నిజం చేసుకునేందుకు ఆమె లండన్ కు, ఆయన సింగపూర్ కు వెళ్లాల్సి వచ్చింది.
దీంతో భేదాభిప్రాయాలు, వేర్వేరు లక్ష్యాల నేపథ్యంలో కలిసి ఉండి ఘర్షణ పడే కంటే... విడాకులు తీసుకుని విడిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ 2016లో సివిల్ జడ్జి మల్కనపట్టె రెడ్డి ఎదుట విడాకుల అభ్యర్థనను దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ శనివారం జరగగా...విచారణకు భర్త హాజరుకాగా, సెలవు దొరకని భార్యను స్కైప్ ద్వారా విచారించిన న్యాయమూర్తి వారిద్దరికీ స్కైప్ ద్వారానే విడాకులు మంజూరు చేశారు.