: పళనిస్వామికి 5 రోజుల డెడ్ లైన్ విధించిన పన్నీర్ సెల్వం!
తమిళనాట ఆన్నాడీఎంకే పార్టీలో రెండు వర్గాల విలీనం ప్రక్రియ ముందడుగు పడక పోగా, హెచ్చరికల వరకూ వచ్చింది. విలీనం చర్చలకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఇస్తున్నామని, ఈలోగా పళనిస్వామి స్పందించకుంటే, ఆపై విలీనం ప్రస్తక్తి ఉండదని, పన్నీర్ సెల్వం జిల్లాల పర్యటనకు వెళ్లి మద్దతు కూడగట్టే యాత్ర ప్రారంభిస్తారని ఆయన వర్గం నేతలు తేల్చి చెప్పారు. 5వ తేదీ నుంచి పన్నీర్ యాత్ర ప్రారంభమవుతుందని, 32 జిల్లాలనూ నెలాఖరులోగా ఆయన చుట్టి వస్తారని, కాంచీపురం నుంచి టూర్ ప్రారంభమవుతుందని మెట్టూర్ ఎమ్మెల్యే సెమ్మాలయ్ వెల్లడించారు.
ఈలోగానే విలీనం చర్చలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నామని, అది పళనిస్వామి చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. కాగా, విలీనం కోసం చర్చించేందుకు రెండు వర్గాల నేతలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ, వారి మధ్య చర్చలలో ముందడుగు పడలేదన్న సంగతి తెలిసిందే. సీఎం పదవి పన్నీర్ కు అప్పగించాలని, జయలలిత మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పన్నీర్ వర్గం పట్టుబడుతూ ఉండటంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.