: శంషాబాద్ లో ఘోరం... పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చి అత్యాచార యత్నం చేసిన ప్రబుద్ధుడు!
శంషాబాద్ మండలంలో చోటుచేసుకున్న దారుణం నాలుగు కుటుంబాల్లో అలజడి రేపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి (23) వివాహం గతేడాది అదే మండలానికి చెందిన వ్యక్తితో జరిగింది. అయితే ఆమె స్వగ్రామానికి చెందిన స్నేహితుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి వివాహం నిశ్చయమైంది. దీంతో తన పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు శ్రీనివాస్ ఆమె అత్తవారింటికి వెళ్లాడు.
తెలిసినవాడని, వివాహ శుభలేఖ తెచ్చాడని ఆమె అతడిని ఇంట్లోకి రానిచ్చింది. అయితే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని, ఆమె అత్తారింటివారు ఎవరూ లేరని గుర్తించిన శ్రీనివాస్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అతను పరారయ్యాడు. దీనిపై ఆమె శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన వివాహిత పుట్టింటిలోను, అత్తారింట్లోను కలకలం రేపగా; నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేయడం అతని ఇంట్లోను, అతనితో వివాహం నిశ్చయించుకున్న వారి ఇంట్లోను కలతలు రేపింది.