: ఇప్పుడు ఏపీపై దృష్టి.. ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతానికి బీజేపీ ప్రణాళికలు!
ఏపీలో టీడీపీతో చేతులు కలిపిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో స్వయంగా బలోపేతం కావాలని భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. విశాఖపట్టణంలోని రుషికొండలో రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీ పట్టు సాధించాలంటే గుజరాత్ తరహాలో బూత్ స్థాయి వరకు కేడర్ ఏర్పాటు చేసి కమిటీలు నియమించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.
నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో బీజేపీకి 1.75 లక్షల సభ్యత్వాలు ఉండగా నేడు ఆ సంఖ్య 25 లక్షలకు చేరుకుంది. దీంతో ఉత్సాహం మీదున్న కమలదళం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మే 25న విజయవాడలో బూత్ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం కానున్నారు. అలాగే జూలై 15, 16 వ తేదీల్లో విశాఖపట్టణంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బలపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.