: విస్తారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలకు క్షణంలో తప్పిన పెను ప్రమాదం!
క్షణంలో పెను ప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్ లైన్స్ విమానం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చంఢీఘడ్ విమానాశ్రయంలో ఎయిర్ విస్తారా విమానం టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో అదే రన్ వేపై ల్యాండ్ అయ్యేందుకు అనుమతించాలంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కి చెందిన ఐఎల్-76 కార్గో విమానం కోరింది.
అయితే విస్తారా విమానం రన్ వే పై నుంచి టేకాఫ్ కు సిద్ధంగా ఉంది. ఇంతలో అదే రన్ వే పైకి వచ్చేస్తున్నామని ఐఏఎఫ్ తెలపడంతో ఏటీసీ నుంచి విస్తారా విమానాన్ని వెనక్కి మళ్లించాలని, గేట్ వద్దకు తీసుకెళ్లాలని ఆదేశాలు పంపారు. దీంతో టేకాఫ్ ను విరమించిన పైలట్ దానిని ఆపేసి, నేరుగా విమానాన్ని గేటువద్దకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో ఐఏఎఫ్ కు చెందిన విమానం రన్ వే పై ల్యాండ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని, ఏమాత్రం ఆలస్యం అయినా 151 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే పరిస్థితి ఏర్పడేదని తెలుస్తోంది. అనంతరం విస్తారా విమానం గంటన్నర ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు బయల్దేరింది.