: భార్యను పంపలేదని లారీతో అత్తింటిని ఢీకొట్టిన అల్లుడు.. నిద్రలోనే వారిని చంపేందుకు యత్నం!


అత్త ఇంటిని లారీతో ఢీకొట్టి అత్తమామలను హతమార్చేందుకు యత్నించాడో ప్రబుద్ధుడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన చంద్ర, మారెక్కలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మారెక్క గుమ్మఘట్ట మండలంలోని మారెంపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తీసుకొచ్చేందుకు చంద్ర తల్లి వెళ్లింది. అయితే కుమార్తెను పంపించేందుకు ఇష్టపడని మారెక్క తల్లి గంగమ్మ, ఆమె కుమారుడు శీనా తీవ్ర పదజాలంలో చంద్ర తల్లిని దూషించారు.

విషయం తెలిసిన చంద్ర శుక్రవారం అర్ధరాత్రి లారీతో అత్తింటికి వెళ్లి ఇంటిని ఢీకొట్టాడు. ఆరు బయట నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను లారీతో ఢీకొట్టి నిద్రలోనే వారిని చంపేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన బావమరిది శీనా కేకలు వేయడంతో అప్రమత్తమైన గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో లారీని వదిలి చంద్ర పరారయ్యాడు. అనంతరం బావమరిది శీనాకు ఫోన్ చేసిన చంద్ర చంపుతానని బెదిరించాడు. గాయాల పాలైన గంగమ్మను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీని సీజ్ చేశారు. చంద్ర కోసం గాలింపు మొదలుపెట్టారు. ఓబులాపురం నుంచి మైనింగ్‌ లోడును నెల్లూరు తీసుకెళ్తుండగా చంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.  
 

  • Loading...

More Telugu News