: పక్షులపై ప్రేమాస్త్రం - పేదలకు పట్టెడన్నం: మన్ కీ బాత్ లో నరేంద్ర మోదీ


దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్న వేళ, నోరు లేని జీవాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉదయం 11 గంటలకు ఆలిండియా రేడియో మాధ్యమంగా తన 'మన్ కీ బాత్'ను ఆయన వినిపించారు. వేసవిలో పశుపక్ష్యాదులు నీళ్లకు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలని కోరారు. తమ ఇళ్లపై చిన్న చిన్న గిన్నెలు, మూకుడులను పెట్టి వాటిల్లో నీటిని నింపుతూ ఉండాలని, వీటి వల్ల పక్షుల దాహార్తి తీరుతుందని అన్నారు. హోటళ్లలో ఆర్డర్ చేసిన ఆహారంలో మిగిలిపోయే పదార్థాలను వృథా చేయకుండా ప్యాక్ చేయించి, బయటకు తెచ్చి కడు పేదలుగా బతుకులు వెళ్లదీస్తున్న వారికి ఇవ్వాలని సూచించారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటైన రోటీ బ్యాంకులకు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలని, అన్నం కోసం వేచి చూసే రోజులు తొలగిన నాడే అభ్యదయ, నవ్య భారతం సిద్ధిస్తుందని అన్నారు.

గుజరాత్, మహారాష్ట్ర ప్రజలు సోమవారం నాడు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేసి, వారికి శుభాభినందనలు తెలిపారు. మన్ కీ బాత్ ద్వారా చిన్నారుల ఆలోచనలను, యువత అభిలాషలను, పెద్దల సలహా, సూచనలను తాను తెలుసుకోవాలని భావిస్తున్నట్టు నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భూతాపాన్ని అదుపులో ఉంచేందుకు ప్రపంచ స్థాయిలో వాతావరణ మార్పుల అంశంపై సదస్సులు జరగాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత యువతలో శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని, ఎటొచ్చీ తమలో దాగున్న శక్తిని కనుగొని, ఆ దిశగా నైపుణ్యాన్ని పెంచుకునే మార్గంలో వెళ్లట్లేదన్న అనుమానాలు తనలో ఉన్నాయని అన్నారు. ఈ వేసవి సెలవులను నైపుణ్యాభివృద్ధికి కేటాయించాలని సలహా ఇచ్చారు. నూతన ప్రదేశాలకు వెళ్లడం, కొత్త విషయాలను తెలుసుకోవడంపై దృష్టిని సారించాలని అన్నారు.

  • Loading...

More Telugu News