: పాకిస్థాన్ లో హిందూ దేవాలయం ధ్వంసం
పాకిస్థాన్ దక్షిణ సింధూ ప్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. థాట్ట జిల్లా ఘరో పట్టణంలోని ఓ హిందూ ఆలయంలోని ప్రధాన దేవతావిగ్రహాలను ధ్వంసం చేశారు. అనంతరం వాటిని ఓ చెత్తకుప్పలో పడేశారు. ఆ ఆలయంలో నెలవారీ పూజాకార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి, గత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఐదుగంటల మధ్య పలువురు దుండగులు ఆలయంలోకి చొరబడి ఈ చర్యకు పాల్పడ్డారని స్థానిక హిందూ కౌన్సిలర్ లాల్ మహేశ్వరి మీడియాకు చెప్పారు. ఆ ఆలయ చరిత్రలో ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని అన్నారు. ఆ పట్టణంలో హిందువులు అధికంగా నివసిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.