: ఆ రీట్వీట్లు నేను చేయలేదు... ప్రజలు ఇటువంటివి నమ్మకూడదు: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను భారతీయ జనతా పార్టీ ఏజెంట్‌గా, మోసగాడిగా అభివర్ణించిన కొన్ని ట్వీట్లు.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ట్విటర్ ఖాతా నుంచి రీట్వీట్ అయి ఉండడం అలజడి రేపాయి. అయితే, వాటిని తాను రీట్వీట్ చేయలేదని సిసోడియా తెలిపారు. తన ట్విటర్ ఖాతా హ్యాక్ అయ్యిందని అన్నారు. అసలు తాను హజారేకు వ్యతిరేక ట్వీటను రీట్వీట్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నానని, అయినప్పటికీ అవి పోవడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటువంటి ట్వీట్లను ప్రజలు నమ్మకూడదని ఆయన కోరారు. తనకు అన్నా హజారేపై ఎంతో గౌరవముందని తెలిపారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించకపోవడంపై అన్నా హజారే ఆప్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సిసోడియా ట్విట్టర్‌లో కనిపించిన ఈ రీ ట్వీట్లు అలజడి రేపాయి.