: శ్రీవారి లడ్డూల్లో బొగ్గు పెళ్లలు... భక్తుల ఆందోళన!
తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భక్తులు భావించే లడ్డూలో ఈసారి బొగ్గు పెళ్లలు వచ్చాయి. ఉచితంగా ఇచ్చే లడ్డూల్లో బొగ్గులు రావడంపై తీవ్ర ఆందోళన చెందిన భక్తులు విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్టు వదిలేశారని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తమపై ఓ అధికారి మండిపడ్డారని భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో శ్రీవారి ప్రసాదంలో మేకులు, రాళ్లతో పాటు చచ్చిన జెర్రులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తయారీలో నాణ్యతను పాటించకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.