: తమిళులకు క్షమాపణ చెప్పాలంటూ.. ప్రకాశ్ రాజ్ ఇంటిని ముట్టడించిన తమిళర్ మున్నేట్ర పడై కార్యకర్తలు!
చెన్నయ్ లోని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నివాసాన్ని తమిళర్ మున్నేట్ర పడై పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. తమిళులే తమిళనాడును పరిపాలించాలి అన్న నినాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పరిపాలించవచ్చు' అన్న విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్, తమిళనాడు ప్రజల మనోభావాలను గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తమిళ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమిళర్ మున్నేట్ర పడై పార్టీ నేత వీరలక్ష్మి సారధ్యంలో కార్యకర్తలు చెన్నై, అడయార్ లోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. సుమారు 50 మంది కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి, ఆందోళనకు దిగడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.