: ఎండలు బాబోయ్ ఎండలు... తెలంగాణలో 4.80 కోట్ల బీరు సీసాలు గుటకాయ స్వాహా!
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు, మూడు వారాల నుంచి 40 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు రావడం లేదు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో బీర్లకు మంచి గిరాకీ పెరిగింది. మద్యం దుకాణాల్లో భారీ ఎత్తున బీర్లు అమ్ముడవుతున్నాయి. ఎండలు రికార్డులను బ్రేక్ చేస్తుండగా, బీర్ల అమ్మకాలు అంతకు మించి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బీర్ల తయారీ, అమ్మకంలో తెలంగాణ రికార్డులు బ్రేక్ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,200 మద్యం దుకాణాలు ఉండగా, అందులో ఉన్న 1,300 బార్లలో బీర్ల అమ్మకాలు ఉప్పొంగాయి. ఏప్రిల్ అమ్మకాల్లో 9.11 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ అగ్రభాగాన నిలవడం విశేషం. తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్ దే.
ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ నిలిచాయి. తెలంగాణలో ఏప్రిల్ లో 40 లక్షల బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. ఒక్కో కేసులో 12 బీర్లుంటాయి. ఈ లెక్కన ఒక్క తెలంగాణలో 4.80 కోట్ల బీర్ల సీసాలు అమ్ముడయ్యాయి. ఎండలు మండిపోవడంతో బీర్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలో 17 రకాల పేర్లతో బీర్లను తయారు చేస్తుండగా, తెలంగాణకు సరిపడా ఉత్పత్తి చేయడంతో పాటు కేరళ, కర్ణాటక, ఏపీలకు 15 లక్షల కేసులు అంటే 1.80 కోట్ల బీరు సీసాలను ఉత్పత్తి చేస్తోంది.