: బీజేపీ నుంచి ఆ హామీ వస్తే కేజ్రీవాల్ ప్రభుత్వం కూలిపోతుంది.. హెచ్చరిస్తున్న రాజకీయ నిపుణులు


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేజ్రీవాల్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న హామీ కనుక బీజేపీ నుంచి వస్తే చాలామంది కేజ్రీవాల్‌కు గుడ్ బై చెప్పడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే ఢిల్లీ సర్కారు కుప్పకూలుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ కేసులో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు అనర్హులయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వారు అనర్హులైనా ఉప ఎన్నికలు తథ్యమని, అప్పుడు కూడా ప్రభుత్వం కూలడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరోవైపు ఇటీవల పంజాబ్, గోవా, రాజౌరీ ఉప ఎన్నిక, ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతుండడంతో పార్టీ అధిష్ఠానంపై నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అధినాయకత్వంతో ఇప్పటికే అల్కా లాంబా, కపిల్ మిశ్రా తదితరులు విభేదించారు. తాజాగా సీనియర్ నేత కుమార్ విశ్వాస్ కూడా అధిష్ఠానంపై తిరగబడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణం ఈవీఎంలు కాదని, ప్రజలు ఓటు వేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని అన్నారు. త్వరలో నాయకత్వ మార్పుపై చర్చిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ కేజ్రీవాల్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్టేనని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News