: 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఖాతాలో మరో రికార్డు!
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో ఇంతవరకు లభించని భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' విడుదలైన సినిమా థియేటర్లన్నీ నిండిపోయాయి. దీంతో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ల సినిమాలకు కూడా దక్కని ఆక్యుపెన్సీ 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' కు లభించడం విశేషం.
సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' సినిమాకు 90 శాతం ఆక్యుపెన్సీ లభించగా అదే ఇంతవరకు భారతీయ సినీ పరిశ్రమలో రికార్డుగా కొనసాగుతోంది. దాని తరువాతి స్థానంలో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్', షారూఖ్ ఖాన్ నటించిన 'రయీస్' సినిమాలు 79 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ధియేటర్లు నిండాయి. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా విడుదలైన తొలిరోజు 95 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ధియేటర్లు నిండిపోయాయి. దీంతో తొలిరోజు అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన భారతీయ సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' రికార్డు నెలకొల్పింది.