: సర్కారు అనుసరించే విధానాల్లో, వ్యూహాల్లో జవాన్లు ఇరుక్కొని ప్రాణాలు కోల్పోవద్దు: మావోయిస్టుల హెచ్చరిక
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవలే మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను తీసిన విషయం తెలిసిందే. అయితే, తమకు ఏ పోలీసు అధికారిపైనా, జవానుపైనా పగలేదని మావోయిస్టులు అన్నారు. తాము గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగానే ఈ దాడికి దిగామని స్పష్టం చేశారు. తన పేరు వికల్ప్‌గా పేర్కొన్న ఓ మావోయిస్టు ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి అందులో పలు విషయాలు చెప్పాడు. విప్లవదారికి అడ్డు ఉండకూడదని, కేంద్ర బలగాలు వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు.
అమాయకులపై దాడులు జరుగుతున్నాయని, తమ మహిళలపై లైంగిక దాడులకు దిగారని, అందుకు ప్రతీకారంగానే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) అనే సంస్థ ప్రతీకారం తీర్చుకుందని చెప్పాడు. తమకు జవాన్లు శత్రువులు కాదని తెలిపిన వికల్స్.. సర్కారు అనుసరించే విధానాల్లో, వ్యూహాల్లో జవాన్లు ఇరుక్కొని ప్రాణాలు కోల్పోవద్దని సూచించాడు. ఆ ప్రాంతంలో ప్రకృతి మొత్తాన్ని దోచుకునేందుకు కొత్తగా రహదారులు వేస్తున్నారని ఈ వీడియోలో వివరించాడు.