: వయసు మళ్లిన వారు దంత క్షయంతో బాధపడుతున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే!
మీ ఇంట్లో ఉండే వయసు మళ్లిన నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు దంతక్షయం సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే...ఎందుకంటే వయసు మళ్లిన వారు దంత క్షయం బారినపడ్డారంటే వారిని మృత్యువు సమీపిస్తోందని భావించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా వయసు మళ్లిన మహిళలు, రుతుక్రమం ఆగిపోయిన మహిళలు చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నా లేదా దంతాలు ఊడిపోతున్నా వారు మృత్యువును సమీపిస్తున్నట్టు అర్ధం చేసుకోవాలని బఫెలో యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఆరున్నరేళ్ల పాటు 55 ఏళ్లు, ఆపై వయసున్న 57 వేల మంది మహిళలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం గుర్తించినట్టు తెలిపారు. చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్న మహిళలు మరణించే ప్రమాదం 12 శాతం ఉండగా, దంతాలు ఊడిపోతున్న వారిలో ఈ ముప్పు 17 శాతం ఉంటుందని వారు వెల్లడించారు. అయితే దంత క్షయంతో బాధపడుతున్నవారంతా ఇదే సమస్యతో మరణిస్తారని చెప్పలేమని, ఏదో ఒక వ్యాధితో మరణించే అవకాశం ఉందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మైకెల్ జే లామనోట్ తెలిపారు.