: కాంగ్రెస్ నేతలకు పౌరుషం లేదు.. ఒట్టి దద్దమ్మలు!: సీఎం కేసీఆర్
తెలంగాణ రావడానికి తాను అడ్డంకాదు, నిలువుకాదు అంటూ వ్యాఖ్యలు చేసి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వెక్కిరించారని, ఆయన అలా మాట్లాడుతోంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముసిముసి నవ్వులు నవ్వారే గానీ ఆయనను ప్రశ్నించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరంగల్ సభలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ అలా మాట్లాడినప్పటికీ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని కేసీఆర్ అన్నారు. ‘ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓ సీఎం 'ఎక్కువ మాట్లాడితే ఒక్క రూపాయి కూడా ఇవ్వపో' అన్నారు. ఇదే ఈటెల రాజేందర్, హరీశ్ రావు ప్రశ్నిస్తే ఆ మాటలు అన్నారు. తెలంగాణపై ఇలా మాట్లాడుతోంటే ఆనాడు టీ కాంగ్రెస్ నేతలకు నెత్తురు లేదా? ఇటువంటి మాటలు విన్నాక కూడా పదవుల కోసం ఆశపడుతూ రాజీనామాలు చేయలేదు’ అని కేసీఆర్ అన్నారు.
ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు మళ్లీ పదవిలోకి వస్తామంటూ ఒకరు గడ్డం పెంచుకుంటామని, మరొకరు మరొకటి అని అంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించి వారికి బుద్ధి చెబుతుందని అన్నారు. ‘ఈ కాంగ్రెస్ దద్దమ్మలు ఆ నాడు పదవుల కోసం నోరు మూసుకొని పడి ఉన్నారు.. ఏనాడైనా మా చెరువులు బాగుచేయాలని అడిగారా?.. అంతేగాక, మళ్లీ ఈ రోజు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నారు.. నేను వారిని సన్నాసులని, దద్దమ్మలని ఎందుకు అంటున్నానో తెలుసా? వారి పాలన వల్లే రైతులు వెనకబడిపోయారు, వారి విధానాల వల్లే తెలంగాణకు నష్టం వచ్చింది, కాంగ్రెస్ నేతలకు పౌరుషం లేదు.. ఒట్టి దద్దమ్మలు’ అని కేసీఆర్ అన్నారు.