: అక్రమవలసదారులు వెళ్లిపోవడానికి సౌదీలో మరో రెండు నెలలే సమయం!
తమ దేశంలో ఉంటున్న అక్రమవలసదారుల క్షమాభిక్ష కాలం పూర్తికావస్తోందని, వారు దేశం నుంచి వెళ్లిపోవడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే వుందని సౌదీ అరేబియా పాస్పోర్టు కార్యాలయ ఉన్నతాధికారి సుల్తాన్ అల్ యహ్య అన్నారు. దీంతో అక్రమవలసదారులను ఆయన హెచ్చరించారు. తాము సూచించిన 75 కేంద్రాల్లో తమ పాస్పోర్టు, వీసాలలో తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. తమ దేశంలో ఉండేందుకు అర్హత పత్రాలుంటేనే వారిని ఉండనిస్తామని తెలిపారు.
క్షమాభిక్ష కాలం పూర్తయినప్పటికీ సౌదీ నుంచి వెళ్లకపోతే 1,00,000 రియాల్స్ (17 లక్షల 10 వేల 110రూపాయలుగా) జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంతేగాక, వారు భవిష్యత్తులో మళ్లీ సౌదీ వీసా పొందలేరని పేర్కొన్నారు. తమ దేశ అధికారిక లెక్కల ప్రకారం దేశ జనాభా 3.2 కోట్లుంటే అందులో 1.2 కోట్ల మంది విదేశీయులే ఉన్నారని ఆయన తెలిపారు. దీంతో తమ దేశంలో నిరుద్యోగ సమస్య ఎదురవుతుందని చెప్పారు.