: నాన్న దగ్గర దర్శకత్వంలో ఏబీసీడీలు నేర్చుకుంటున్నా: రాజమౌళి తనయుడు కార్తీకేయ
బాహుబలి సినిమా కోసం రాజమౌళి తనయుడు కార్తీకేయ కూడా తన వంతు సాయం అందించిన విషయం తెలిసిందే. బాహుబలి-2 సినిమా విడుదలకు సిద్ధమవడంతో ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘నాన్న దగ్గర దర్శకత్వంలో ఏబీసీడీలు నేర్చుకుంటున్నా, ఆయనకు కుడి భుజంలా తయారయ్యే ప్రయత్నం చేస్తున్నా’నని అన్నాడు. తన మీద నమ్మకంతో రాజమౌళి కొన్ని బాధ్యతలు అప్పగించారని, తన విధులు నిర్వర్తించే క్రమంలో కొన్ని సార్లు తిట్లు కూడా తిన్నానని అన్నాడు. అయితే, తనకు చిన్నప్పటి నుంచి ఇంట్లో వారితో తిట్లు తిట్టించుకోవడం అలవాటేనని చమత్కరించాడు. బాహుబలి-1 సినిమా విడుదలైన రెండు, మూడు రోజుల వరకు నెగిటివ్ టాక్ రావడంతో కంగారు పడిపోయామని, అనంతరం ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఎంతో సంతోషపడ్డామని తెలిపాడు.