: నభా జైలు నుంచి గతేడాది తప్పించుకుని, పంజాబ్ లో నాటకీయంగా పట్టుబడ్డ గ్యాంగ్ స్టర్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నభా జైల్ బ్రేక్' కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్ స్టర్ సుఖ్ చైన్ సింగ్ ను పంజాబ్ ఓసీఐయూ (ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్) అధికారులకు నాటకీయంగా పట్టుబడ్డాడు. గత సంవత్సరం నవంబరులో సుఖ్ చైన్ సింగ్ జైలు నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, ఓ దేశవాళీ ఫిస్టల్, లైసెన్స్ ఉన్న .32 బోర్ రివాల్వర్, 630 గ్రాముల మాదకద్రవ్యాలతో సహా, ఓ తప్పుడు రిజిస్ట్రేషన్ ఉన్న కారులో నభా - సంగ్రూర్ రహదారిపై సుఖ్ చైన్, వెళుతూ పట్టుబడ్డాడు.
అతను ప్రయాణిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం రావడంతో, తనిఖీలు జరుపుతూ, కార్లను చెక్ చేస్తుండగా, సుఖ్ చైన్ దొరికాడని అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇతనిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం సహా పలు కేసులున్నాయని వెల్లడించారు. ఇతనితో పాటు జైలు నుంచి పారిపోయిన వారిలో ఇప్పటివరకూ 22 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.