: తీరంలో 300 ఫిరంగులను మోహరించి, మాక్ డ్రిల్ నిర్వహించిన కిమ్ జాంగ్ ఉన్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అగ్రరాజ్యానికి చెమటలు పట్టిస్తున్నారు. ఉత్తరకొరియా సరిహద్దులో శత్రుదేశాలు అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా మిలిటరీ కవాతు నిర్వహించిన రెండో రోజే కిమ్ నిర్వహించిన మాక్ డ్రిల్ అమెరికాను బెంబేలెత్తించేలా చేసింది. మిలిటరీ వార్షికోత్సవాల పేరిట నిర్వహించిన ఈ అతిపెద్ద, బీభత్సమైన మాక్ డ్రిల్ లో శత్రుదేశాల యుద్ధ నౌకలపై ఏ విధంగా దాడులు చేయాలనే వ్యూహాన్ని ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు పాలుపంచుకున్న ఈ మాక్ డ్రిల్ లో ఉత్తరకొరియా పశ్చిమ తీరం వోన్ శాన్ లో సముద్ర తీరం వెంబడి సుమారు 300 పైగా ఫిరంగులను మోహరించి, శత్రుదేశాల నౌకలపై విరుచుకుపడినట్లు బీభత్సంగా దాడులు జరిపారు.
దీంతో అమెరికా బెంబేలెత్తిపోయింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు తాము ఊహించినంత సామాన్యుడు కాదని భావించింది. దీంతో ఆగమేఘాల మీద 'దక్షిణకొరియాకు రక్షణ' కల్పించాలంటూ కార్ల్ విన్ సన్ యుద్ధ నౌకల టీమ్ ను, థాడ్ మిస్సైల్ వ్యవస్థను కూడా తరలించింది. ఈ వ్యవస్థ అమెరికా రక్షణ రంగానికి అత్యంత నమ్మకమైనది. స్వల్ప, మధ్య శ్రేణి క్షిపణులను మొదటి దశలోనే ధ్వంసం చేసే శక్తి అమెరికా థాడ్ మిసైల్ వ్యవస్థకు ఉండడం వివిధ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.