: మామూలోడు కాదు.. కోటి రూపాయలతో దర్యాప్తు అధికారినే కొనేసిన స్కాం సూత్రధారి!
బోధన్ వాణిజ్యపన్నుల కుంభకోణం దర్యాప్తు అధికారి విజయ్ కుమార్ నే కోటి రూపాయలకు స్కాం సూత్రధారి సునీల్ కొనేయడం కలకలం రేపుతోంది. బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో నకిలీ పత్రాలతో గడిచిన మూడేళ్ళ కాలంలోనే 70 కోట్లు కొల్లగొట్టిన సునీల్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు పలు ఆసక్తికర విషయాలు గర్తించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసులో దర్యాప్తు మందకొడిగా సాగుతుండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందో రహస్యంగా కూపీలాగారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా దర్యాప్తు అధికారి విజయ్ కుమార్ నే కోటి రూపాయలకు లొంగదీసుకున్నట్టు తెలిసి షాక్ తిన్నారు.
ఈ స్కాం గురించిన సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో తన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని గుర్తించిన సునీల్...ఏదో ఒకరోజు పోలీసులు తనను పట్టుకుంటారని నిర్ణయానికి వచ్చాడు. దీంతో విచారణ పేరుతో తనను వేధించకుండా ఉండాలని, అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తనపై చేయిచేసుకోకూడదని, జాగ్రత్తగా న్యాయస్థానంలో లొంగిపోయేందుకు సహకరించాలన్న షరతులతో తన అనుచరుడు రామలింగంను రంగంలోకి దింపాడు. అప్పటికే ప్రభుత్వాధికారులను మచ్చిక చేసుకోవడంలో ఆరితేరిన రామలింగం...ఈ కేసులో దర్యాప్తు అధికారి విజయ్ కుమార్ ను కోటి రూపాయలకు కొనేశాడు. దీంతో ఆ కేసు దర్యాప్తు మందకొడిగా సాగింది. దీంతో అనుమానం వచ్చిన ప్రభుత్వం మరో అధికారిని రంగంలోకి దించింది. ఆ అధికారి రంగంలోకి దిగి సునీల్ తో ఈ కేసు దర్యాప్తు అధికారి విజయ్ కుమార్ చేసుకున్న ఒప్పందాన్ని వెలికి తీశారు.
దీంతో ఆయన సస్పెండ్ అయ్యారు. అంతే కాకుండా ఈ అధికారులు ఈ కేసులో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చారు. వాణిజ్యపన్నుల అధికారులను ప్రలోభపెట్టడం ద్వారా జరుగుతున్న అవకతవకలు బయటపడకుండా చూడటంతోపాటు అందుకు సహకరించేలా ప్రధాన నిందితుడు సునీల్ ప్రభుత్వ అధికారులను లొంగదీసుకునేవాడు. ఇందుకు ప్రతిగా ప్రభుత్వ వాణిజ్యపన్నుల అధికారులను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. తనకు వచ్చే ఆదాయంలో 60 శాతం వారికి పంచి పెట్టేవాడు. మిగతా 40 శాతాన్ని మాత్రమే తన వాటాగా తీసుకునేవాడు.
గత మూడేళ్ళ కాలంలోనే ఇలా అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ సుమారు 70 కోట్ల రూపాయలు నొక్కేశాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంటే ఈ లెక్కన... అతను మొత్తం 175 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడగా, అందులో సుమారు 105 కోట్ల రూపాయలను ప్రభుత్వ అధికారులకు పంచి పెట్టగా, తాను మాత్రం 70 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇంత భారీ కుంభకోణాన్ని సమర్థవంతంగా డీల్ చేసేందుకు సునీల్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. నకిలీ పత్రాలు తయారు చేసే వ్యవహారం సునీల్ అనుచరుడు విశాల్ చూసేవాడు. మరో అనుచరుడు రామలింగం అధికారులతో మధ్యవర్తిత్వం నెరిపేవాడు. కుంభకోణంలో సహకరించడానికి అధికారులను ప్రలోభపెట్టినట్లే ఈ కుంభకోణం బయటపడ్డ తర్వాత దాన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులను కూడా విజయవంతంగా రామలింగం ప్రలోభపెట్టడం గమనార్హం. దీంతో అధికారులు షాక్ తిన్నారు.