: లీకైన బాహుబలి-2 ఫొటోలపై స్పందించిన నిర్మాత శోభు యార్లగడ్డ!
ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు సంబంధించిన పలు ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో విడుదలైపోయిందని పలు పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆ చిత్రం నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి-2’ సినిమాకు సంబంధించినంతవరకు ఇప్పటివరకూ ఎక్కడా ప్రదర్శనలు మొదలుకాలేదని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు ఫోటోలు ఎక్కడినుంచి లీకయ్యాయో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. తమ సినిమా ఇతర దేశాల్లో కూడా రిలీజ్ కానుందని, ఆయా దేశాల్లో సెన్సార్ సభ్యులకు ఈ సినిమాను చూపించామని తెలిపిన ఆయన... ఆ సమయంలో ఎవరో ఫోటోలు తీసి సినిమాకు సంబంధించిన పలు ఫొటోలను నెట్‌లో పెట్టి ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.