: విశ్వనాథ్ గారి సినిమాల్లో శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం సినిమాలు నాకు చాలా ఇష్టం!: పవన్ కల్యాణ్
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, శాలువతో సత్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కె.విశ్వనాథ్ గారు దేశం గర్వించదగ్గ సినిమాలు తీశారని అన్నారు. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం ఆనందం కలిగించిందని అన్నారు. శంకరాభరణం సినిమాను చిన్నప్పుడు చాలా సార్లు చూశానని ఆయన తెలిపారు. విశ్వనాథ్ గారి సినిమాల్లో శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం సినిమాలు తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు. స్వయంకృషి సినిమా షూటింగ్ చూసేందుకు చాలా సార్లు వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు.