: చిత్తూరుకు ‘యాపిల్’.. ఐదు లక్షలమందికి ఉద్యోగాలు!: చంద్రబాబు వెల్లడి
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ యాపిల్ కంపెనీ చిత్తూరు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. జిల్లాలో తయారీ యూనిట్‌ను నెలకొల్పేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆపిల్ పరిశ్రమ ఏర్పాటైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఆపిల్ కంపెనీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు వివరించారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల (హార్డ్‌వేర్) తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరుతుందన్నారు.