: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును బీసీసీఐ ప్రకటించకపోయినా...మైఖేల్ క్లార్క్ ప్రకటించాడు
ఐసీసీ వ్యవహార శైలికి నిరసనగా బీసీసీఐ జూన్ 1 నుంచి ఇంగ్లండ్ లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులన్నీ తమ దేశాల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న జట్లను ప్రకటించాయి. ఐసీసీ ఏప్రిల్ 25వ తేదీ చివరి తేదీ అంటూ డెడ్ లైన్ విధించినా బీసీసీఐ పట్టించుకోవడం లేదు. బీసీసీఐపై కక్షగట్టిన ఐసీసీ చీఫ్ శశాంక్ మనోహర్ ను తాము నమ్మలేమని బీసీసీఐ అధికారి నేరుగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించదని భావించాడో లేక భారత జట్టుపై అభిమానంతోనో తెలియదు కానీ ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇలా ఉంటే బాగుంటుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అతని అభిప్రాయం ప్రకారం... ఓపెనర్ లు గా రోహిత్ శర్మ, అజింక్య రహానె క్రీజులో దిగాలను ఆకాంక్షించాడు. టాప్ ఆర్డర్ భారాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ మోయాలని సూచించాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే... రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఓటేశాడు. పేసర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు ఓటేసి...చాంపియన్స్ ట్రోఫీలో ఈ జట్టు ఉంటే టీమిండియాదే విజయం అని క్లార్క్ ప్రకటించాడు. కాగా టీమిండియాలో క్లార్క్ కు మంచి స్నేహితులు ఉన్న సంగతి తెలిసిందే.