: నాలుగున్నర దశాబ్దాలుగా ఎత్తిన చేయి దించని సాధువు.. ప్రపంచ శాంతికోసమట!
ప్రపంచశాంతి కోసం అమర్ భారతి అనే సాధువు అత్యంత కఠినమైన దీక్షను చేపట్టి 44 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. అమర్ సంసార జీవితంలోనే ఉండేవారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన గృహస్థాశ్రమాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించారు. ప్రపంచంలో నెలకొన్న తీవ్ర అశాంతి పోయి శాంతి నెలకొనాలని కోరుతూ 1973లో తనకుతాను దీక్ష తీసుకున్నారు.
అందులో భాగంగా తన కుడి చేతిని పైకెత్తారు. అప్పటి నుంచి ఒక్కసారి కాదు కదా ఒక్క క్షణం కూడా దానిని దించలేదు. నాలుగున్నర దశాబ్దాలుగా చేయి కదిలించకపోవడంతో అది బిగుసుకుపోయి గట్టిగా కర్రలా మారి కదలలేని స్థితికి చేరుకుంది. కఠిన దీక్షతో అమర్ భారతి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కుంభమేళాల్లో పాల్గొనే ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. అమర్‌ను ఆదర్శంగా తీసుకున్న పలువురు సాధువులు కూడా ఇటువంటి దీక్షనే చేపట్టారు. వారిలో కొందరు పాతికేళ్లు, 13 ఏళ్లు, ఏడేళ్లుగా దీక్ష కొనసాగిస్తున్నారు.