: మంచు ఫలకం మాయేంటో...?


ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఒకవైపు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా వేడిమి పెరిగిపోవడం వల్ల గ్రీన్‌ల్యాండ్‌ లాంటి మంచు ప్రదేశాల్లో పేరుకుపోయివున్న మంచు పలకలు విపరీతంగా కరిగిపోతున్నాయని ఇది మానవాళి మనుగడకు ప్రమాదమని ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతల మూలకంగా గ్రీన్‌ల్యాండ్‌లోని భారీ మంచుపలకల్లో చోటుచేసుకునే మార్పులను అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నాసా సౌరశక్తితో నడిచే ఒక ప్రత్యేక రోవర్‌ను కూడా గ్రీన్‌ల్యాండ్‌కు పంపనుంది. శుక్రవారం నుండి జూన్‌ 8 వరకూ గ్రోవర్‌ అనే పేరుగల ఈ రోవర్‌ మంచు ఫలకంపై తిరుగుతూ నమూనాలను సేకరిస్తుంది.

నేలలోకి చొచ్చుకుని పోగల రాడార్‌ అమర్చిన ఈ రోవర్‌ ద్వారా మంచు పేరుకుపోతున్న తీరును అధ్యయనం చేయవచ్చు. గత ఏడాది సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో గ్రీన్‌ల్యాండ్‌ ఉపరితలంపై మంచు దాదాపు 97 శాతం దాకా కరుగుదల కనిపించింది. అయితే ఆ తర్వాత ఈ మంచుఫలకలపై ఏర్పడ్డ పొరలను గ్రోవర్‌ ద్వారా గుర్తించాలని, తద్వారా ఈ భారీ మంచు ఫలకంలో చోటుచేసుకుంటున్న మార్పులను గురించి అర్ధం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. అన్నట్టు డార్ట్‌మౌత్‌ కాలేజీకి చెందిన మరో శాస్త్రవేత్తల బృందం 'కూల్‌రోబో' అనే పేరుతో మరో రోవర్‌ను గ్రీన్‌ల్యాండ్‌పైకి పంపనున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తితో ఉన్నారు.

  • Loading...

More Telugu News