: అప్పుడు, నన్ను భారతీయుడిలా లేరన్నారు: మిజోరాం ముఖ్యమంత్రి
మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు జాత్యహంకారానికి బలైపోతున్నారని మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో జాత్యహంకారం కనపరచడం దారుణమని, ఈ దురహంకారాన్ని తాను ఎన్నోసార్లు చవిచూశానని అన్నారు.
ఈ సందర్భంగా తనకు జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తూ.. ‘సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఓ విందుకు హాజరయ్యాను. అక్కడ ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ .. ‘మీరు భారతీయుడిలా లేరు!’ అన్నాడు. అందుకు, నేను ‘భారతీయుడు ఎలా కనిపిస్తాడో ఒక వాక్యంలో చెప్పు’ అని అడిగాను’ అని చెప్పుకొచ్చారు.
దేశం గురించి తెలియని వాళ్లు సామాన్యులైనా, జాతీయస్థాయి నాయకులైనా ఒకటేనని, అసలు, దేశం గురించి తెలియనివాళ్లు నాయకులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, ఏ పార్టీ వారికైనా దేశం గురించి తెలియకపోతే వారికి దేశభక్తి, విద్య కొరవడినట్టు చెప్పవచ్చని అన్నారు. ప్రపంచంలోని ప్రధాన జాతులన్నీ మన దేశంలో ఉన్నట్టు జాతీయ నేతలకు తెలియదని, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ వాదం అత్యధికంగా ఉండటానికి ఇదే కారణమని అన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల వారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భారతీయులుగా అంగీకరించడం లేదన్నారు.