: తొలి వెయ్యి స్థానాలు కేసీఆర్ వే!: హరీష్ రావు
టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ ఎవరనే ప్రశ్నకు స్థానమే లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకటి నుంచి వెయ్యి స్థానాల వరకు కేసీఆరే ఉంటారని చెప్పారు. మరో 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని... తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పాలనే కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను కొనసాగిస్తున్నామని చెప్పారు. హన్మకొండలోని టీఆర్ఎస్ బహిరంగసభ వేదికను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తమకు ఏమాత్రం పోటీ ఇవ్వలేవని చెప్పారు. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికే విపక్షాలు టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. బహిరంగసభ సందర్భంగా కేవలం అనుమతి ఉన్న చోట మాత్రమే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.