: హైదరాబాద్‌లో దారుణం.. యువతి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం!
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కాదని ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళ తాను నమ్మిన ఓ యువకుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే నగరంలోని కేపీహెచ్‌బీ రోడ్డు నం.2లో వ్యాపారవేత్త అంజిరెడ్డి, ప్రత్యూష (26) దంపతులు నివాసం ఉండేవారు. వారికి నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. గత ఏడాది వ్యాపార నిమిత్తం అంజిరెడ్డి శ్రీలంక వెళ్లాడు. అదే సమయంలో వీరి కుటుంబంతో సన్నిహితంగా ఉండే శ్రీనివాస్‌తో ప్రత్యూష వివాహేతర సంబంధం పెట్టుకుంది.
శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన అంజిరెడ్డికి తన భార్య ప్రత్యూష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అంజిరెడ్డి ఈ విషయాన్ని పెద్దల మధ్య పరిష్కరించుకుందామని అనుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ప్రత్యూషకు కుటుంబ పెద్దలు సూచించారు. అయితే, ఆమె తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే తన భర్తతో ప్రత్యూష తీవ్రస్థాయిలో గొడవపెట్టుకొని మూడు నెలల క్రితం తన కూతురిని తీసుకొని శ్రీనివాస్ దగ్గరకు వచ్చేసింది. తాము భార్యాభర్తలమని చెప్పుకొని ఇంటి యజమానిని నమ్మించి వారు బాలాజీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
ఇటీవల ప్రత్యూష ప్రకాశం జిల్లా అద్దంకిలోని తమ పుట్టింటికి వెళ్లి తన కూతురును అక్కడే వదిలి తిరిగి వచ్చింది. ఏం జరిగిందో తెలియదు... నిన్న సాయంత్రం ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపారు. పోలీసులు అక్కడకు వచ్చి చూడగా అద్దెకు ఉంటోన్న ఆ ఇంట్లో బెడ్‌రూంలో ప్రత్యూష హత్యకు గురై కనిపించింది.
ఆమెను గొంతులో కత్తితో పొడిచి మూడు రోజుల క్రితం ఎవరో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మూడు రోజులుగా శ్రీనివాస్ కనిపించకుండా పోవడంతో ఆయనే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.