: నా జీవితంలో నాన్నను ఒకేఒక్క కోరిక కోరాను: నారా లోకేష్
ఏపీ ప్రభుత్వం నేడు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా, విజయవాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ముళ్లకిరీటం వంటిదని అన్నారు. తన జీవితంలో తండ్రిని ఒకేఒక్క కోరిక కోరానని చెప్పారు. తనను మంత్రి వర్గంలోకి రావాలని ఆయన అన్నప్పుడు, తనకు పంచాయతీ రాజ్ శాఖ ఇవ్వండని కోరానని, పల్లెటూరికి సేవ చేయాలన్న కోరిక తనకుందని చెప్పానని అన్నారు.
తన కోరికను తెలుసుకున్న మీదటే, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఐటీ శాఖను కూడా కలిపి తనకిచ్చారని వ్యాఖ్యానించారు. తనను మంత్రిని చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఆదాయం తెలంగాణకు, అప్పులు ఆంధ్రాకు మిగిలాయని అన్నారు. పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్టేనన్నది తన అభిప్రాయమని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్త మొక్కలను నాటడంలో ముందుందని, ఆ జిల్లా ఆదర్శంగా రాష్ట్రమంతటా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.